Tuesday 13 December 2011

జగన్... ఇప్పటికైనా అర్ధమయిందా?

చంద్ర బాబు పై విచారణకు హైకోర్ట్ స్టే  ఇచ్చిన వార్త ను ఇప్పుడే చూసాను ఇంటర్నెట్ లో.
ముందే చెప్పాను నేను ఇంతకూ ముందు నా పోస్ట్ లో. చూసారా అవిశ్వాసం పెట్టినందుకు ఇచ్చిన బహుమతి.

కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ CBI ఢిల్లీ ఆదేశాలను పాటించటం తప్ప ఇంకేమి చెయ్యదు, చేసే దమ్ము నిజాయితి లేదు అనే విషయం ఎన్నో సార్లు రుజువయింది, అవుతూనే వుంటది.


జగన్ ... 
ఇప్పటికైనా అర్ధమయిందా ఈ దేశం లో నకిలీ గాంధీ ఫ్యామిలీ కి ఎదురు తిరిగితే ఏమవుతుందో ...

ఒక MLA కొడుకుగా పుట్టి CM కొడుకుగా ఎదిగిన నీకు సామాన్యుడి బాధలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి గాని, లంచం ఇవ్వకుండా ఒక్కటంటే ఒక్కపని జరగని ఈ అతి పెద్ద అవినీతి దేశం లో, న్యాయం నిస్పక్షపాతం గా జరగదని  మా లాంటి నేలబారు మనిషి / ఓటరు కు ఎప్పుడో తెలుసు.

కావాలంటే ఒక్కసారి కాంగ్రెస్స్ లోకి మరల వస్తాను అని చెప్పు, అదే CBI నీకు హరిశంద్ర అని సత్కరించకుంటే నన్నడుగు. 

కసాబ్ ను, అఫ్జల్ గురు ను కొత్త అల్లుడు లా చూసి , కడుపు కాలి పవార్ ని కొట్టిన సింగ్ పై చర్య లు తీసుకొనే ఈ దేశం లో, ఈ పాలనలో ఇంతకంటే ఏమి ఆశించలేము.

జగన్, చంద్రబాబు కేసు లను ఒకేలా దర్యాప్తు చేస్తుంది అనుకోవటం అత్యాశే.

మించిపోయింది లేదు..

చిరంజీవిని చూసి అయినా రాజకీయం నేర్చుకో జగన్.

Tuesday 6 December 2011

జె.పి నువ్వు రాజకీయం నేర్చావ్!

నువ్వు లోక్ సత్తా పెట్టినప్పుడు తెలివైన వాడు రాజకీయాల లోకి వచ్చాడు రాజకీయాలు కొంచెమైనా మారుతాయి లే అని అత్యాశ పడ్డ నేలబారు తెలుగోడిని. ఎంతోమందికి నీ పార్టీ గురించి చెప్పి గెలిచినా ఓడినా ఒక మంచివాడికి వోట్ వెయ్యాలి అని కొంత మందితో అయినా నీ పార్టీ కి ఓటేసిన , వేయించిన వాడిని.


కాని,


గత కొద్ది నెలలుగా నీ ప్రవర్తన , నిన్న అసెంబ్లీ లో నీ స్పీచ్, నిర్ణయం చూసాకా నువ్వు అందరిలా ఒక రాజకీయ నాయకుడివే అనే నిర్ణయానికి వచ్చా. కాకపోతే మాటలు నేర్చిన, చిలకలా మాటలు మాత్రమే చెప్పి చేతలు ఏమాత్రం చెయ్యని ఒక తెలివైన మాజీ IAS వి.


అయ్యా,


ఎప్పుడో నువ్వే చెప్పిన ఒక నీతిని ఇక్కడ ఉదహరిస్తా. చెప్పే ముందు మనం చేసి చూపించాలి అని గాంధీ చెప్పాడు అన్నావ్ . 


మరీ నిన్ను నమ్మి అసెంబ్లీ కి పంపిన kukatpally ప్రజలను ఎన్ని సార్లు వెళ్లి పలకరించావ్? ఎన్ని సార్లు వాళ్ళ సాధక బాధకాలు తెలుకున్నావ్? అవి పరిష్కరించటానికి ఏమి చేసావ్?  సమస్యల మీద ఎన్ని సార్లు సమ్మె చేస్సావ్, ప్రభుత్వాన్ని నిలదీసావ్? ప్రజలను చైతన్య పరిచావ్? 


చెప్పాలంటే ఏమి చెయ్యలేదు , ఏమి అంటే ఏమి చెయ్యలేదు, కనీసం చెయ్యాలన్న సంకల్పం లేదు.


  ఎప్పుడో IAS కు ప్రిపేర్ అయ్యేటప్పుడు చదివినది గుర్తుకు వచ్చిందేమో నిన్న నే అసెంబ్లీ లో ఇంకో నీతి చెప్పావ్. MLA నియోజక వర్గ ప్రజల అవసరాలు తీర్చాలట, వారి అభివృద్దికి పాల్పడలట, నిధులని దుర్వినియోగం చెయ్యకుండా కర్చుపెట్టాలట, పారదర్సికత ఉండాలట.


నీ నియోజక వర్గ అభివృద్దిని, నీకు నీ నియోజక వర్గం పట్ల వున్నా నిబద్దతని ,రాజకీయాల పట్ల నీ చిత్తశుద్దిని  ఒకసారి పరిశీలిస్తే నీ మాటలు పేద్ద బాలశిక్షను మించిన నీతులు గా కనిపిస్తున్నాయి ప్రతిసారి రాజకీయ నాయకుల చేతిలో ఓడిపోతున్న నాలాంటి నిస్సహాయ ఓటరుకు.


తెలంగాణాకు వ్యతిరేకం అన్నావ్. దెబ్బ పడగానే దెయ్యం దిగిందేమో వ్యతిరేకం కాదన్నావ్.
ఏంటయ్యా జెపి  ఇది? ముందు నువ్వు ఇచ్చిన నీతులు వివరణ తప్పు అనిపించిందా లేక భయమేసింద?


అసెంబ్లీ లో నిన్న నే చెప్పిన ఇంకో జోక్ ను చెప్తాను ఇప్పుడు.
కిరణ్ విలువల కోసం పాటు పడుతున్నాడట? ఈమాట చెప్తున్నప్పుడు నీలో నువ్వే నవ్వుకొని వుంటావ్ ఖచ్చితంగా, MLA ల ను అవిశ్వాసానికి వ్యతిరేకం గా ఓటు వెయ్యమని సూట్ కేసు లు పంపిన విషయం గుర్తొచ్చి. నీకు కూడా సూట్ కేసు అందిందేమో అని నా డౌట్ నిన్న నువ్వు తటస్తంగా వుండటం చూసాక. తటస్తంగా అంటే అనుకూలంగా అని నీకు తెలియదా, లేకా జనాలు ఇంకా అర్ధం చేసుకొనే స్థితిలో లేరు అనుకున్నావా?


పోయిన ఎలక్షన్ లలో అందరికి చెప్పినట్లే మా నాన్నకు కుడా చెప్పాను నీకు ఓటు వెయ్యమని.


ఒక నవ్వు నవ్వి  అందరు రంగు మార్చిన రాజకీయ వుసర వెల్లులు. ఈయన రంగు ఇంకా మార్చని వుసరవెళ్లి , అంతే కాని రంగు మార్చటం చేతకానో , చెయ్యలేనో వ్యక్తి కాదు రా అన్నాడు.


ఆ నవ్వుకు అర్ధం నిన్న ఇంకా బాగా అవగతం అయింది.


ఇంకెప్పుడు నీతులు చెప్పకు. వెగటు పుడుతుంది నాలాంటి నేలబారు ఓటరుకి.


Tuesday 15 November 2011

మంత్రుల జీత, భత్యాలు పెరుగుతున్నాయి.

మా ముత్తాతల కాలం లో వ్రాసుకున్న మన రాజ్యాంగం ఇచ్చిన అతి పెద్ద అవకాశం.
ఎవరికీ లేని అవకాశం మన రాజకీయ నాయకులకు వుంది, తన జీతాలను తనే పెంచుకొని ఆమోదించుకొనే అద్బుత అవకాశం.


అయ్యా,
చచ్చి చెడి 18 సంవత్సరాలు చదివి , మంచి మార్కుల తో డిగ్రీ తెచ్చుకొని, ఆ తర్వాత ప్రతి రోజు 10 గంటలకు తగ్గకుండా పని చేసి వర్షానికి ఒకసారి జీతం పెంచామనటానికి manager తో గొడవ. ఇంత చేసినా పెరుగుతుందనే గ్యారంటీ లేదు.


మరి...
ఏమి పీకారని ఈ మంత్రులకు (ఈ మాట అనటానికి మనసు రావటం లేదు) జీతాలు పెంచాలి.
బూతులు బాగా తిడుతున్నందుకా? తిట్టుకుంటూ ఉన్నందు కా?
GAS, PETROL, TAX , VAT బాగా పెంచినందుకా?
JOBS రాకుండా సమర్ధవంతంగా అడ్డుకున్నందుకా?
గత 2 ఏళ్ళుగా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తున్నందుకా?
అక్కడ ఇక్కడ సమ్మెలు చేసి జనాల్ని విజయవంతం గా విడదీశారనా?
లేకా కుంభకోణాలు చేసరనా?


ఎందుకు పెంచాలి రా?


తిట్టుకోవటం తప్ప ఏమి చెయ్యలేని నాలాంటి వోటర్ మీది నమ్మకం కాబోలు.


తరాలు మారటం తప్ప, ఈ రాజకీయం మారదు, నాయకులు మారరు, వారసత్వం మారదు.


అన్ని ఆ త్రాసులోని కప్పలే.

Monday 14 November 2011

బాబు, మీరెందుకు మాట్లాడుతున్నారు? మన పత్రికలూ, టివి లు మాట్లాడు తాయిగా....

ఇది ప్రజాస్వామ్యం పై దాడి.
ఇది పత్రికా స్వేఛ్చ పై దాడి.

అయినా అన్నా హజారే అన్న లాంటి మీ మీద CBI ఎంక్వయిరీ నా?

అయినా మీరెందుకు సమాదానం ఇస్తున్నారు?
మన టివి లు మాట్లాడుతాయి. మన పత్రికలూ వ్రాస్తాయి.
మీరు respond అవటం రామోజీ కి , ఆర్ కే కి, CM కిరణ్ కు, నాకు చాలా బాద కలిగిస్తుంది.
మా పత్రికలకు , ప్రభుత్వాని కి ఇంత సహాయ సహకారాలు అందిస్తున్నారు, మేము help చెయ్యలేమని ఎందుకు అనుకుంటున్నారు? సిబిఐ మనదే వర్రీ కాకండి.

జగన్ పై ఎంక్వయిరీ అంటే ఓకే, నీపై ఎంక్వయిరీ నా, మీరు ఏదో ఒకటి చెయ్యండి.
మా తరఫున మేము ఏమి చెయ్యగలమో అది చేస్తాం.

Monday 3 October 2011

తండ్రి అయితే గాని తెలిసి రాలేదు.!

 మేన మామ అంటే రామ్ కు చాలా ఇష్టం.

చిన్నప్పటి నుంచి ప్రతి పనిలో , ప్రతి విజయం మామ ఉండేవాడు. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అనేదానికి పెర్ఫెక్ట్ ఉదాహరణ మామ. కాబట్టి రామ్ మనసులో తన పిల్లలకి కూడా తన మామ లాంటి మేన మామ ఉండాలి 
అనేది కోరిక.



6 సంవత్సరాల క్రితం ....


పెళ్లి చూపులు చూసి వచ్చావ్. Updates ఏమిటిరా రామ్? అడిగాడు శ్రీకాంత్.
అమ్మాయి ఒక్కటే , అన్నా తమ్ముళ్ళు ఎవరూ లేరు శ్రీకాంత్ .

నేను అడిగింది అమ్మాయి గురించి వాళ్ళ బ్రదర్స్ గురించి కాదు అన్నాడు శ్రీకాంత్.

ఈ  అమ్మాయిని చేసుకుంటే నాకు మా మామ వున్నట్లు నా పిల్లలకు మేన మామ ఉండడురా  శ్రీకాంత్ అన్నాడు  రామ్. 

శ్రీకాంత్ 
నవ్వి, అది ఆ అమ్మాయి తప్పు కాదుగా? అది ఆ అమ్మాయి చేతిలో గాని వాళ్ళ తల్లిదండ్రుల చేతిలో  గాని లేనిది. అయినా లేనిదాన్ని వున్నట్లుగానో, చెప్పవలసిన విషయాన్ని దాచిపెడితెనో తప్పుగాని ఇది  ఆలోచించాల్సిన  పాయింటో, వద్దు అని చెప్పేంత పెద్ద కారణం కాదు అన్నాడు.

ఏమో శ్రీకాంత్ నన్ను నేను సముదాఇంచుకోలేక  పోతున్నాను  అన్నాడు  రామ్ .

రామ్
, అమ్మాయి  వాళ్ళు  అడుగుతున్నారు  ఏమి  చెప్పమంటావురా  అన్నాడు  మేనమామ .

నీకు తెలుసుగా మామ బ్రదర్స్ లేరు , పైగా ఒక్కటే కూతురు. వాళ్ళ అమ్మా నాన్నను  నేనే సాకలేమో 
ముసలోళ్ళు  అయ్యాక?

వాళ్ళు నాకు  బాగా  తెలుసురా. నీ మీద ఆధారపడే మనుసులు కాదురా వాళ్ళు అన్నాడు  మామ. రామ్  అజ్ఞానాన్ని , అతి
 తెలివిని చూసి నవ్వుతూ.

అయినా తనను తానూ ఒప్పించుకోలేని రామ్ ఆ సంబంధం వద్దు అని చెప్పేశాడు.


ఇప్పుడు....

ఏరా ఆనంద్ అమ్మాయిని చూసి వచ్చావట, ఏమిటి విశేషాలు?
నచ్చిందా ఆ
 అమ్మాయి, నువ్వు నచ్చావా  ఆ అమ్మాయికి?

అమ్మాయి బాగుందిరా .
ఏమి చదివింది ఏమి?
ఇంజనీరింగ్ చేసిందటరా.
జాబ్ చేస్తుందా?
హ ...infy లో  చేస్తుంది.

మరి లేట్ ఎందుకు? ప్రాబ్లం ఏమిటి  కట్నం తక్కువ ఇస్తామన్నారా ఏమిటి?

అమ్మాయి ఒక్కటే కూతురు
. బ్రదర్స్ సిస్టర్స్ లేరు అట రా.

మంచిదే కదా ఆస్తి మొత్తం నీకే వస్తుంది.

నీ బొంద, ఆ పిల్లను  చేసుకుంటే  వాళ్ళ  అమ్మా  నాన్నను నేనే సాకాలి. కష్టంరా
.  ఆస్తి అ తర్వాతి మాట. అందుకే వద్దు అని చెప్పుదాము అనుకుంటున్నా.

ఈ సంభాషణ విన్న రామ్  పక్కలో  బాంబు  పడినట్లు  అయింది
.
ఎందుకంటే  రామ్  ఇప్పుడు  తండ్రి  కాబట్టి. ఒక్కరే ముద్దు ఇంకొకరు వద్దు అనుకుంటున్నాడు కాబట్టి. అంటే తన  కూతుర్ని చేసుకోబోయే వాడుకూడా ఇలాగే ఆలోచిస్తాడా అనే  ఆలోచన  మొదలైంది  కాబట్టి.

కావచ్చును  కాకపోవచ్చును.....

 సరిగా  ఒక  6 సంవత్సరాల  క్రితం  తన  మాటలు  గుర్తొచ్చాయి  రామ్ కి .
తన ఆలోచనలు మాటలు ఎంత  చెడో , బాధో బాగా తెలిసొచ్చింది. 

Wednesday 14 September 2011

తెగులు పట్టిన నా తెలుగు

ఆ మాటకొస్తే మన ముఖ్యమంత్రి తెలుగు కి, మంచు అక్క తెలుగు కి, ఆంధ్ర ప్రదేశ్ లోని 80 శాతం మంది తెలుగు కి తెగులే కాదు ఇంకా చాలా  పట్టాయి.


కాకపోతే నాకు జరిగిన ఈ సంఘటనలు తలచుకున్నప్పుడల్లా నవ్వు వస్తుంది.  ఏదో మీతో పంచుకుందాం అని అంతే.


ఇది రెండు పుష్కరాల క్రితం సంగతి.


 మా తాత మా పల్లెటూరి లో, చుట్టూ 16 పల్లెల్లో చెప్పుకోదగ్గ రైతు ఆ రోజుల్లో. ఎవరు వడ్డీకి అప్పు కావాలి అన్నా పెద్ద  వెంకటయ్య (మా తాత) దగ్గరికి వచ్చేవారు. వడ్డీ ఇచ్చే ముందు  బాండ్ మీద సంతకం తీసుకొనే వాడు.

బాండ్ పత్రము ఎలా వ్రాయాలి, వడ్డీ ఎలా  లెక్క కట్టాలో మాకు బళ్ళో చెప్పారు.

ఓయ్ 'బొంతా' ఇట్టా రా అని  పిలిసె మా తాత.
 పిల్లికి కూడా బిచ్చెం పెట్టని మా తాత పిలుస్సండాడే, ఎమన్నా బోరుగులకు డబ్బులిస్సాడేమో  అని ఆశగా పోయినా అరుగు కాడికి.

 'ఎం తాత' అన్నా.

 సెట్టిగారి ఇంటికి పోయి ఒక 'పొత్తము' తీసుకొని రాపో అనె.
 బ్రహ్మ రాత అర్ధం కాని  మామూలు మనిసి సూసి నట్టు సూసినా మా తాత ను.

 ఏమిరా బెల్లం కొట్టిన రాయివున్నట్టు ఇంగా ఇన్నే ఉండావు? బిన్నే తీసుకొని  రాపో, పో అని అరిసె.

 ఏమి తేవాలే తాతా? అని అడిగినా మెల్లగా.
 పొత్తము రా, అనె.  ఇంకా నాకు అర్ధం కాలేదని అర్ధం అయినట్లుంది ,  'బొక్కు' రా అన్నాడు వచ్చి రాని ఇంగ్లీష్ లో.

 ఈ కాన్మెంట్లలో సదివి ఈ  పిల్లకాయలు అట్ట తెనుంగు రాక, ఇట్ట తెల్లోళ్ళ బాష రాక గబ్బు పట్టినారుపో అనె ఆ అరుగు మీద వున్న వాళ్ళతో. అరుగు మీద వున్న వాళ్ళంతా  నవ్వుతా వుంటే నాకు కోపం వచ్చింది, సరేలే అని గమ్ముగా వున్నా.

 అట్టనే లే. అని వురుకుతున్ననన్ను మల్ల పిలిసి 'కలం' కూడా తీసుకొని రారా అనె.

 కలం అంటే పెన్ అని తెలియని నేను, మా తాత వైపు చూసి పెద్దగా నవ్వి, నేనేమన్నా ఆంజనేయ సామి నా మీ కళ్ళం ఒక్కన్ని తీసుకు రావటానికి అన్నా.

 కలం అంటే మనం గడ్డి తిప్పేది కాదు రా, 'పేనా' రా అన్నాడు వచ్చి రాని ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంకా రెండు తిట్లు ఎక్కువ తిట్టాడు నా  తెలుగు గురించి.


 పెన్, బుక్ తెచ్చిన తర్వాతా నన్నే రాయమన్నాడు బాండ్. చివర్లో 'బిక్కలం' అని తన పేరు వ్రాయమన్నాడు.
 బిక్కలం ఏందీ తాత బిక్కలం, ఏదో బిక్క సచ్చినట్టు అని నవ్వినా.

 అంటే బాండ్  వ్రాసిన వాళ్ళు, సాక్షి కూడా అయితే అలా వ్రాస్తారు రా, ఇది కూడా తెలియని మీ సదువులు ఎందుకు రా అని రెండు తిట్లు ఎక్కువ తిట్టాడు మల్ల.

 ఆ దెబ్బతో తెలుగు నేర్చుకోవాలన్న కసి పెరిగి పెద్ద బాలశిక్ష, రామాయణం, వెంకటేశ్వర సుప్రభాతం  మొత్తం నెలలోపే నేర్చుకుని మా తాత తో శభాష్ అనిపించుకున్నా.

ఇప్పుడు మా తాత లేడు కాని ఆయన తోటి ఇలాంటి చాలా అనుభవాలు, పాఠాలెన్నో నాలో మిగిలాయి.


Monday 5 September 2011

ఎద్దు అయి పుట్టి నా అప్పు తీర్చుకుంటావురా!

ఏమి తాత ఒక రూపాయి ఇస్తే సచ్చిపోతవా? బొరుగులు కొనుక్కుంటాను ఈ తాత.
పోరా నాయాలా, ఎన్నించి వస్తాయి డబ్బులు, ఎమన్నా సెట్లకు కాస్సాయా  అని గదురుకున్నాడు మా తాత.


ఆ రోజుల్లో పెద్ద వెంకటయ్య  అంటే చుట్టూ 10 పల్లెల్లో షావుకారి. ఎవురికి డబ్బు అవసరం అయినా ఈ గుమ్మమే తొక్కుతారు అని పేరు. అఫ్ కోర్సు వడ్డికే అనుకోండి.

సూసినా సూసినా, ఎన్ని సార్లు అడిగినా మా తాత డబ్బులు ఇవ్వడని అర్ధం అయ్యింది.
ఒకరోజు మా తాత చేతిలో 100 రూపాయల నోట్ వుంటే గుంజుకొని ఇదే సందు అని  పరుగు లంఖించుకున్నాను.


కాసేపు అయినానిక మా తాత పిలిచాడు. దూరం గా నిలబడి 'ఎం?' అన్నా, దగ్గరికి వెళితే డబ్బులు తీసుకుంటాడని.
నాలాంటి వాళ్ళను చాలామందిని సూసినోడు కాబట్టి నన్ను ఎలా సముదాయించాలో, దండించాలో బాగా తెలుసు  మా తాతకు.


 చానా సేపు బుజ్జగించాడు కాని నేను ఎంతకీ వినక పోయే సరికి


ఒరేయ్ నా డబ్బులు ఇవ్వకుంటే ఎద్దు అయి పుట్టి మా ఇంట్లో పని పొలం పనులు చేసి అప్పు తీర్చుకుంటావురా ఆ కర్రె ఎద్దు మాదిరి అనె.


ఒక క్షణం వెన్ను లో వణుకు పుట్టింది నాకు.
ఏంటి మీ ఇంట్లో ఎద్దా? ఆ బతుకు గాడిద కంటే హీనం తాత వద్దులే అని డబ్బులు తిరిగి ఇచ్చిన, రోజూ ఆ ఎద్దుల బతుకు చూసినోడిని కాబట్టి.

అలా ఎందుకు భయపడ్డానా అని తలచుకున్నప్పుడల్లా  బాగా నవ్వు వస్తుంది ఇప్పుడయితే.


ఇప్పుడు మా తాత లేడు కాని ఆయన తోటి ఇలాంటి చాలా అనుభవాలు, పాఠాలెన్నో నాలో మిగిలాయి.



Thursday 1 September 2011

మా ఇంటి పేరు ఎలా వచ్చిందంటే?

అది చిన్న పల్లెటూరు. రమారమి 70 గడపలు వుంటాయి. ఒక 10 ఇండ్లు వీరంరెడ్డి వాళ్ళవి. ఊర్లోని చాలా మందిలాగే   సన్నకారు రైతులు. ఇప్పటి ప్రభుత్వాలు చెప్పే సన్నకారు కాదు, నిజంగానే 'సన్న'కారు రైతులు.

ఏమోయి బొంతా, యాడికి పోతుండావ్? రామాలయం  అరుగు మీద నుంచి కొరివి మామ అడుతాంటే నా కోపం ముక్కుమీదకి కాదు ఒళ్ళంతా వచ్చింది. శాంత మూర్తి ని కాకపోయినా పెద్ద కోపిష్టిని కాను, కాని ఎవరైనా 'బొంతా' అని పిలుస్తే ఇక శివాలే.

 ఎం మామ బో అరుస్సండావే, పేరు పెట్టి పిల్సలేవా అన్నాను  ఎమన్నా అనుకోని లే అని.  

ఓ సీత పెద్దమ్మ , బొంతోల్లని బొంత అనక ఏమనిపిలసాలనో నువ్వైనా చెప్పు అని పెద్దగా నవ్వే మామ.  అరుగు మీదున్న అందరు నవ్వుతాంటే ఈసారి కోపం తో పాటు ఏడుపు కలిపి వచ్చింది నాకు.

అట్ట పిల్సాకు మని  నువ్వైనా చెప్పవ్వా మామ కు అన్నా మా సీతవ్వతో. సీతవ్వ మా నాయన కు మేనత్త. మాతో పాటు మా ఇంట్లోనే వుంటది.

ఇదిగో పొట్టేలు కోసి పార్టీ ఇచ్చి అప్పుడు చెప్పు ఇట్ట పిల్సాకండి అని అప్పుడు వింటారు కాని, ఇలా అరుగు కాడ చెప్తే ఎవురు వినరబ్బాయ్ అనె చిన్నావుల అయ్య.

నా కోపం చూసి మా సీతవ్వ , ఒరేయ్ ఒక 60-70 యేండ్ల క్రితం మన ఇంటి పేరు వీరంరెడ్డి రా అన్నది . ఆ మాటను మా అవ్వ నొక్కి, గర్వం గా చెప్పటం నాకు బాగా గుర్తు.
అప్పట్లో ఇప్పుడున్నట్లు పట్టాలు, పత్రాలు లేవురా ఎప్పటికి అలా ఉండటానికి.

పిచ్చిగుంట్ల వాళ్ళు ఎప్పుడు వస్తున్నట్లే ఆ ఎండాకాలం వచ్చారు. వాళ్ళు రాముడి దగ్గరి నుంచి మొన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దాక అన్ని బుర్రకధ లా చెప్తారు. మధ్యలో పిట్ట కథ లు చెప్తుంటారు. వాళ్ళు ఊర్లో వున్నన్ని రోజులు రోజుకో ఇంటి వాళ్ళు అన్నం పెట్టి, ఉండటానికి వసతి చూపించాలి.

మన వంతు రోజు కడుపునిండా అన్నం పెట్టి, పడుకోవటానికి మన కొట్టం చూపించాం. కింద పర్చుకోవటానికి అని బొంత ఇచ్చాం. అంతే ఆరోజు నుంచి మనల్ని బొంతోల్లు అని పిలవటం మొదలెట్టారు. మీ నాయన ఉద్యోగం వచ్చాక రికార్డు లలో కుడా అలాగే రాశారు.  అలా బొంతోల్లం అయ్యాం కాని మనం వీరం రెడ్డి వాళ్ళం రా అనె.

ఇప్పుడు కొరివి మామ ఇంగా పగలబడి నవ్వే.

ఎమోబ్బ బో నవ్వు తున్డాడు గాని, కొరివి మామ కధ చెప్తాను వినరా అనె.

వీళ్ళ వంతు రోజు రాత్రి భోజనం లో నెయ్యి సరిగ్గా పడిందా లేదా అని వీళ్ళ అవ్వ కొరివి పెట్టి చూసింది అందుకే వీళ్ళు కోరివోల్లు అయ్యారు.
అదిగో ఆ మామ వాళ్ళు ఇచ్చిన పాలల్లో కొంచెం గొర్రె బొచ్చు వచ్చింది అందుకే వాళ్ళు బొచ్చోల్లు అయ్యారు.

కాకుంటే వాళ్ళు ఇంటిపేరు పొలం పట్టాలలోమారకుండా చూసుకున్నారు, మనకు అంత తెలివి లేకపోయ నాయనా అని ఒక నిట్టుర్పు విడిసింది మా అవ్వ.

Saturday 27 August 2011

నాకంటే అదృష్టవంతుడు కాదేమో అనిపిస్తుంది



ఏనుగు పూలమాల వేస్తే బిక్షగాడు రాజయ్యాడని చందమామ కధ చదివి
ఆ రాజెంత అదృష్టవంతుడో అనుకొనేవాడిని ...

కానీ 

వరుణధార లో ఓ రతీ రూపంతో ఇంత సమీపం నుంచి సంభాషిస్తుంటే 
ఆ రాజు నాకంటే అదృష్టవంతుడు కాదేమో అనిపిస్తుంది!

Monday 22 August 2011

పార్లమెంట్ / అసెంబ్లీ జైలు

నేను తెలుగు వార్తా పత్రికలూ చదవటం, టివి చూడటం మానేసి చాలా రోజులయింది,ఆరోగ్య రీత్యా మంచిది కాదని తెలిసి.  గొల్లపూడి వారు చెప్పినట్లు , కొంచెం ప్రశాంతత దొరికింది ఆ తర్వాత.

ఒక నెల క్రితం అనుకుంట, ఇంటర్నెట్ లో వార్తలు చదువుతుంటే ఒక వార్త నన్ను బాగా ఆకర్షించింది.
ఇంగ్లాండ్ లో ఒక lord (మన MP లాగ అన్నమాట) 20000 పౌండ్ లకు  (అంటే పదిహేను లక్షల రూపాయలు ) తప్పుడు బిల్ లు చూపించాడని అతన్ని విచారించి  కేవలం 2౦ రోజుల్లోనే విచారణ పూర్తి చేసి  లార్డ్ పదవి ఊడబీకి, జైలు లో పెట్టారు.  

ఎంత తేడా? ఇలాంటి దూకుడు, నిస్పాక్షికతా, చర్య, భారత దేశం లో జరగాలంటే ఇంకెంత కాలం పడుతుందో?   ఎంత కాలానికైనా జరుగుతుందన్న నమ్మకమైతే నాకు లేదు. 

కేవలం పదిహేను లక్షల రూపాయల తప్పుడు పనికే ఆ దేశం లో జైలు శిక్ష వేశారు. కేవలం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే అవినీతి ఈ దేశం లో నిత్య కృత్యం, చాలా చాలా సాధారణం అయింది కాబట్టి,  ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం లో ఈ రోజు దాక  అవినీతి చేసిన రాజకీయ నాయకుడిపై కుట్ర లేకుండా విచారణ జరగా లేదు కాబట్టి, జరిగినా జైలు కు వెళ్ళిన దాకలాలు లేవు కాబట్టి.

 కనిమొళి, రాజా పై చర్యలు, జగన్ పై CBI దాడులు సంతొషించ దగ్గవే అయినా సమర్ధించ దగ్గవి కాదు, ఎందుకంటే అవి రాజకీయ దాడులు. 2G కుంభకోణం గురించి బిజేపి మూడు వర్షాల క్రితం నుంచి నెత్తి నోరు బాదుకొని చెప్తుంది. కాకపోతే  ఇప్పుడు కరుణానిధి అవసరం లేదు కాబట్టి చర్య తీసుకున్నారు. జగన్ ఫై చర్య ఇంకా అంత కంటే తక్కువది ఏమి కాదు.

అయ్యా! బ్రిటన్ లో లాగా చట్టం మనదేశం లో పని చేసి వుంటే, పని చేస్తే బోఫర్స్ కుంభకోణం లో నెహ్రు కుటుంబం ఎప్పుడో తీహార్ జైలు లో వుండాలి, కార్గిల్ కుంభకోణం లో బిజేపి ఏనాడో  ఊచలు లెక్కబెడుతూ వుండాలి, కరుణానిధి తాత, జయమ్మ, బాబు , రామోజీ, YS ఎప్పుడో అవినీతి ఫై చర్యకు ఉదాహరణలుగా మిగిలేవాళ్ళు.

ఇప్పుడు అసలు పాయింట్ కు వద్దాం. 
ఏమి వున్నా భావ దారిద్ర్యం ఉండకూడదు  అనే వాడు మా తాత.   ఒక్కడంటే ఒక్కడు కూడా నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు లేని ఈ దేశం లో,  ఒకవేళ చట్టం తన పని సరిగ్గా చేస్తే ఇప్పుడు ఉన్న చెరసాలలు సరిపోతాయా అనేది నన్ను తొలుస్తున్న ప్రశ్న. 

ఇప్పుడున్న జైలు లు ఎలాగూ సరిపోవు కాబట్టి, అన్ని రాష్టాల లోని అసెంబ్లీ లను అసెంబ్లీ జైలు గానో  , పార్లమెంట్ ను పార్లమెంట్ జైలు గానో చేస్తే సరిపోతుందేమో.

ఏమంటారు?


Sunday 20 March 2011

దెయ్యానికి చదువు రాకపోతే?


వెన్నెల్లో మంచం మీద పడుకొని చెప్పటం మొదలెట్టాడు.

రోజు పేపర్ లలో ఒకటే గోల, ఏదో దెయ్యం ఒకటి రాత్రిపూట వస్తుందని, జాగ్రత్తగా వుండాలని.
ఆ దెయ్యానికి ఒంటి నిండా కళ్ళు అని, మనుషులని చంపుతుందని ఒకటే వార్తలు.
దెయ్యాన్ని కొంతమంది చూసారని, చంపబోతే తప్పించుకున్నామని కొందరు చెప్పినట్లు పేపర్ లో వార్తలు.
మొత్తoమ్మీద విరుగుడిని సూచించారు. "ఓ స్త్రీ రేపురా " అని ఇంటి గోడ మీద వ్రాస్తే, దెయ్యం అది చదివి తర్వాతి రోజు రావటానికి వెళ్లి పోతుంది అని. అలాగే చేసారు, కొద్దిరోజుల పాటు దెయ్యం గురించిన వార్తలు లేవు. దెయ్యం కు చిరాకు వచ్చి వెళ్లిపోయింది అని చెప్పుకున్నారు.

చెప్పిందంతా విని ఓ ఏడు ఏళ్ళ పిల్లకాయ అడిగాడు. "మరి దెయ్యానికి చదువు రాకపోతే?",  "వచ్చినా తెలుగు రాకపోతే?"

ఆ ప్రశ్నలకు, ఆలోచనా సరళి కి నాకు దిమ్మ తిరిగింది. ఎంత తేడా ఇప్పటి తరానికి , నా తరానికి.
ఈ ప్రశ్న ఇన్ని రోజులు నాకు రానందుకు చాలా సిగ్గేసింది అంటే నమ్మండి.


ఏమంటారు?