Wednesday 14 September 2011

తెగులు పట్టిన నా తెలుగు

ఆ మాటకొస్తే మన ముఖ్యమంత్రి తెలుగు కి, మంచు అక్క తెలుగు కి, ఆంధ్ర ప్రదేశ్ లోని 80 శాతం మంది తెలుగు కి తెగులే కాదు ఇంకా చాలా  పట్టాయి.


కాకపోతే నాకు జరిగిన ఈ సంఘటనలు తలచుకున్నప్పుడల్లా నవ్వు వస్తుంది.  ఏదో మీతో పంచుకుందాం అని అంతే.


ఇది రెండు పుష్కరాల క్రితం సంగతి.


 మా తాత మా పల్లెటూరి లో, చుట్టూ 16 పల్లెల్లో చెప్పుకోదగ్గ రైతు ఆ రోజుల్లో. ఎవరు వడ్డీకి అప్పు కావాలి అన్నా పెద్ద  వెంకటయ్య (మా తాత) దగ్గరికి వచ్చేవారు. వడ్డీ ఇచ్చే ముందు  బాండ్ మీద సంతకం తీసుకొనే వాడు.

బాండ్ పత్రము ఎలా వ్రాయాలి, వడ్డీ ఎలా  లెక్క కట్టాలో మాకు బళ్ళో చెప్పారు.

ఓయ్ 'బొంతా' ఇట్టా రా అని  పిలిసె మా తాత.
 పిల్లికి కూడా బిచ్చెం పెట్టని మా తాత పిలుస్సండాడే, ఎమన్నా బోరుగులకు డబ్బులిస్సాడేమో  అని ఆశగా పోయినా అరుగు కాడికి.

 'ఎం తాత' అన్నా.

 సెట్టిగారి ఇంటికి పోయి ఒక 'పొత్తము' తీసుకొని రాపో అనె.
 బ్రహ్మ రాత అర్ధం కాని  మామూలు మనిసి సూసి నట్టు సూసినా మా తాత ను.

 ఏమిరా బెల్లం కొట్టిన రాయివున్నట్టు ఇంగా ఇన్నే ఉండావు? బిన్నే తీసుకొని  రాపో, పో అని అరిసె.

 ఏమి తేవాలే తాతా? అని అడిగినా మెల్లగా.
 పొత్తము రా, అనె.  ఇంకా నాకు అర్ధం కాలేదని అర్ధం అయినట్లుంది ,  'బొక్కు' రా అన్నాడు వచ్చి రాని ఇంగ్లీష్ లో.

 ఈ కాన్మెంట్లలో సదివి ఈ  పిల్లకాయలు అట్ట తెనుంగు రాక, ఇట్ట తెల్లోళ్ళ బాష రాక గబ్బు పట్టినారుపో అనె ఆ అరుగు మీద వున్న వాళ్ళతో. అరుగు మీద వున్న వాళ్ళంతా  నవ్వుతా వుంటే నాకు కోపం వచ్చింది, సరేలే అని గమ్ముగా వున్నా.

 అట్టనే లే. అని వురుకుతున్ననన్ను మల్ల పిలిసి 'కలం' కూడా తీసుకొని రారా అనె.

 కలం అంటే పెన్ అని తెలియని నేను, మా తాత వైపు చూసి పెద్దగా నవ్వి, నేనేమన్నా ఆంజనేయ సామి నా మీ కళ్ళం ఒక్కన్ని తీసుకు రావటానికి అన్నా.

 కలం అంటే మనం గడ్డి తిప్పేది కాదు రా, 'పేనా' రా అన్నాడు వచ్చి రాని ఇంగ్లీష్ లో. ఇప్పుడు ఇంకా రెండు తిట్లు ఎక్కువ తిట్టాడు నా  తెలుగు గురించి.


 పెన్, బుక్ తెచ్చిన తర్వాతా నన్నే రాయమన్నాడు బాండ్. చివర్లో 'బిక్కలం' అని తన పేరు వ్రాయమన్నాడు.
 బిక్కలం ఏందీ తాత బిక్కలం, ఏదో బిక్క సచ్చినట్టు అని నవ్వినా.

 అంటే బాండ్  వ్రాసిన వాళ్ళు, సాక్షి కూడా అయితే అలా వ్రాస్తారు రా, ఇది కూడా తెలియని మీ సదువులు ఎందుకు రా అని రెండు తిట్లు ఎక్కువ తిట్టాడు మల్ల.

 ఆ దెబ్బతో తెలుగు నేర్చుకోవాలన్న కసి పెరిగి పెద్ద బాలశిక్ష, రామాయణం, వెంకటేశ్వర సుప్రభాతం  మొత్తం నెలలోపే నేర్చుకుని మా తాత తో శభాష్ అనిపించుకున్నా.

ఇప్పుడు మా తాత లేడు కాని ఆయన తోటి ఇలాంటి చాలా అనుభవాలు, పాఠాలెన్నో నాలో మిగిలాయి.


Monday 5 September 2011

ఎద్దు అయి పుట్టి నా అప్పు తీర్చుకుంటావురా!

ఏమి తాత ఒక రూపాయి ఇస్తే సచ్చిపోతవా? బొరుగులు కొనుక్కుంటాను ఈ తాత.
పోరా నాయాలా, ఎన్నించి వస్తాయి డబ్బులు, ఎమన్నా సెట్లకు కాస్సాయా  అని గదురుకున్నాడు మా తాత.


ఆ రోజుల్లో పెద్ద వెంకటయ్య  అంటే చుట్టూ 10 పల్లెల్లో షావుకారి. ఎవురికి డబ్బు అవసరం అయినా ఈ గుమ్మమే తొక్కుతారు అని పేరు. అఫ్ కోర్సు వడ్డికే అనుకోండి.

సూసినా సూసినా, ఎన్ని సార్లు అడిగినా మా తాత డబ్బులు ఇవ్వడని అర్ధం అయ్యింది.
ఒకరోజు మా తాత చేతిలో 100 రూపాయల నోట్ వుంటే గుంజుకొని ఇదే సందు అని  పరుగు లంఖించుకున్నాను.


కాసేపు అయినానిక మా తాత పిలిచాడు. దూరం గా నిలబడి 'ఎం?' అన్నా, దగ్గరికి వెళితే డబ్బులు తీసుకుంటాడని.
నాలాంటి వాళ్ళను చాలామందిని సూసినోడు కాబట్టి నన్ను ఎలా సముదాయించాలో, దండించాలో బాగా తెలుసు  మా తాతకు.


 చానా సేపు బుజ్జగించాడు కాని నేను ఎంతకీ వినక పోయే సరికి


ఒరేయ్ నా డబ్బులు ఇవ్వకుంటే ఎద్దు అయి పుట్టి మా ఇంట్లో పని పొలం పనులు చేసి అప్పు తీర్చుకుంటావురా ఆ కర్రె ఎద్దు మాదిరి అనె.


ఒక క్షణం వెన్ను లో వణుకు పుట్టింది నాకు.
ఏంటి మీ ఇంట్లో ఎద్దా? ఆ బతుకు గాడిద కంటే హీనం తాత వద్దులే అని డబ్బులు తిరిగి ఇచ్చిన, రోజూ ఆ ఎద్దుల బతుకు చూసినోడిని కాబట్టి.

అలా ఎందుకు భయపడ్డానా అని తలచుకున్నప్పుడల్లా  బాగా నవ్వు వస్తుంది ఇప్పుడయితే.


ఇప్పుడు మా తాత లేడు కాని ఆయన తోటి ఇలాంటి చాలా అనుభవాలు, పాఠాలెన్నో నాలో మిగిలాయి.



Thursday 1 September 2011

మా ఇంటి పేరు ఎలా వచ్చిందంటే?

అది చిన్న పల్లెటూరు. రమారమి 70 గడపలు వుంటాయి. ఒక 10 ఇండ్లు వీరంరెడ్డి వాళ్ళవి. ఊర్లోని చాలా మందిలాగే   సన్నకారు రైతులు. ఇప్పటి ప్రభుత్వాలు చెప్పే సన్నకారు కాదు, నిజంగానే 'సన్న'కారు రైతులు.

ఏమోయి బొంతా, యాడికి పోతుండావ్? రామాలయం  అరుగు మీద నుంచి కొరివి మామ అడుతాంటే నా కోపం ముక్కుమీదకి కాదు ఒళ్ళంతా వచ్చింది. శాంత మూర్తి ని కాకపోయినా పెద్ద కోపిష్టిని కాను, కాని ఎవరైనా 'బొంతా' అని పిలుస్తే ఇక శివాలే.

 ఎం మామ బో అరుస్సండావే, పేరు పెట్టి పిల్సలేవా అన్నాను  ఎమన్నా అనుకోని లే అని.  

ఓ సీత పెద్దమ్మ , బొంతోల్లని బొంత అనక ఏమనిపిలసాలనో నువ్వైనా చెప్పు అని పెద్దగా నవ్వే మామ.  అరుగు మీదున్న అందరు నవ్వుతాంటే ఈసారి కోపం తో పాటు ఏడుపు కలిపి వచ్చింది నాకు.

అట్ట పిల్సాకు మని  నువ్వైనా చెప్పవ్వా మామ కు అన్నా మా సీతవ్వతో. సీతవ్వ మా నాయన కు మేనత్త. మాతో పాటు మా ఇంట్లోనే వుంటది.

ఇదిగో పొట్టేలు కోసి పార్టీ ఇచ్చి అప్పుడు చెప్పు ఇట్ట పిల్సాకండి అని అప్పుడు వింటారు కాని, ఇలా అరుగు కాడ చెప్తే ఎవురు వినరబ్బాయ్ అనె చిన్నావుల అయ్య.

నా కోపం చూసి మా సీతవ్వ , ఒరేయ్ ఒక 60-70 యేండ్ల క్రితం మన ఇంటి పేరు వీరంరెడ్డి రా అన్నది . ఆ మాటను మా అవ్వ నొక్కి, గర్వం గా చెప్పటం నాకు బాగా గుర్తు.
అప్పట్లో ఇప్పుడున్నట్లు పట్టాలు, పత్రాలు లేవురా ఎప్పటికి అలా ఉండటానికి.

పిచ్చిగుంట్ల వాళ్ళు ఎప్పుడు వస్తున్నట్లే ఆ ఎండాకాలం వచ్చారు. వాళ్ళు రాముడి దగ్గరి నుంచి మొన్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దాక అన్ని బుర్రకధ లా చెప్తారు. మధ్యలో పిట్ట కథ లు చెప్తుంటారు. వాళ్ళు ఊర్లో వున్నన్ని రోజులు రోజుకో ఇంటి వాళ్ళు అన్నం పెట్టి, ఉండటానికి వసతి చూపించాలి.

మన వంతు రోజు కడుపునిండా అన్నం పెట్టి, పడుకోవటానికి మన కొట్టం చూపించాం. కింద పర్చుకోవటానికి అని బొంత ఇచ్చాం. అంతే ఆరోజు నుంచి మనల్ని బొంతోల్లు అని పిలవటం మొదలెట్టారు. మీ నాయన ఉద్యోగం వచ్చాక రికార్డు లలో కుడా అలాగే రాశారు.  అలా బొంతోల్లం అయ్యాం కాని మనం వీరం రెడ్డి వాళ్ళం రా అనె.

ఇప్పుడు కొరివి మామ ఇంగా పగలబడి నవ్వే.

ఎమోబ్బ బో నవ్వు తున్డాడు గాని, కొరివి మామ కధ చెప్తాను వినరా అనె.

వీళ్ళ వంతు రోజు రాత్రి భోజనం లో నెయ్యి సరిగ్గా పడిందా లేదా అని వీళ్ళ అవ్వ కొరివి పెట్టి చూసింది అందుకే వీళ్ళు కోరివోల్లు అయ్యారు.
అదిగో ఆ మామ వాళ్ళు ఇచ్చిన పాలల్లో కొంచెం గొర్రె బొచ్చు వచ్చింది అందుకే వాళ్ళు బొచ్చోల్లు అయ్యారు.

కాకుంటే వాళ్ళు ఇంటిపేరు పొలం పట్టాలలోమారకుండా చూసుకున్నారు, మనకు అంత తెలివి లేకపోయ నాయనా అని ఒక నిట్టుర్పు విడిసింది మా అవ్వ.