Monday, 5 September 2011

ఎద్దు అయి పుట్టి నా అప్పు తీర్చుకుంటావురా!

ఏమి తాత ఒక రూపాయి ఇస్తే సచ్చిపోతవా? బొరుగులు కొనుక్కుంటాను ఈ తాత.
పోరా నాయాలా, ఎన్నించి వస్తాయి డబ్బులు, ఎమన్నా సెట్లకు కాస్సాయా  అని గదురుకున్నాడు మా తాత.


ఆ రోజుల్లో పెద్ద వెంకటయ్య  అంటే చుట్టూ 10 పల్లెల్లో షావుకారి. ఎవురికి డబ్బు అవసరం అయినా ఈ గుమ్మమే తొక్కుతారు అని పేరు. అఫ్ కోర్సు వడ్డికే అనుకోండి.

సూసినా సూసినా, ఎన్ని సార్లు అడిగినా మా తాత డబ్బులు ఇవ్వడని అర్ధం అయ్యింది.
ఒకరోజు మా తాత చేతిలో 100 రూపాయల నోట్ వుంటే గుంజుకొని ఇదే సందు అని  పరుగు లంఖించుకున్నాను.


కాసేపు అయినానిక మా తాత పిలిచాడు. దూరం గా నిలబడి 'ఎం?' అన్నా, దగ్గరికి వెళితే డబ్బులు తీసుకుంటాడని.
నాలాంటి వాళ్ళను చాలామందిని సూసినోడు కాబట్టి నన్ను ఎలా సముదాయించాలో, దండించాలో బాగా తెలుసు  మా తాతకు.


 చానా సేపు బుజ్జగించాడు కాని నేను ఎంతకీ వినక పోయే సరికి


ఒరేయ్ నా డబ్బులు ఇవ్వకుంటే ఎద్దు అయి పుట్టి మా ఇంట్లో పని పొలం పనులు చేసి అప్పు తీర్చుకుంటావురా ఆ కర్రె ఎద్దు మాదిరి అనె.


ఒక క్షణం వెన్ను లో వణుకు పుట్టింది నాకు.
ఏంటి మీ ఇంట్లో ఎద్దా? ఆ బతుకు గాడిద కంటే హీనం తాత వద్దులే అని డబ్బులు తిరిగి ఇచ్చిన, రోజూ ఆ ఎద్దుల బతుకు చూసినోడిని కాబట్టి.

అలా ఎందుకు భయపడ్డానా అని తలచుకున్నప్పుడల్లా  బాగా నవ్వు వస్తుంది ఇప్పుడయితే.


ఇప్పుడు మా తాత లేడు కాని ఆయన తోటి ఇలాంటి చాలా అనుభవాలు, పాఠాలెన్నో నాలో మిగిలాయి.